: బెంగళూరులో మరో ఏటీఎం దాడి.. ప్రాణాలకు తెగించిన సెక్యూరిటీ గార్డు
బెంగళూరులో ఏటీఎంలపై దాడులు పెరిగిపోతున్నాయి. అక్రమంగా డబ్బు సంపాదిద్దామనే ఆలోచనతో దొంగలు నగర శివార్లలోని ఏటీఎంలపై విరుచుకుపడుతున్నారు. జ్యోతి ఉదయ్ పై జరిగిన దాడి ఉదంతం మరవక ముందే మరో ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరు నగరశివార్లలోని హొంగసంద్రలోని ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డ ఆగంతుకుడు సెక్యూరిటీ గార్డును వేట కొడవలితో గాయపరిచి కట్టేశాడు. ఏటీఎంలోని నగదులూటీకి ప్రయత్నించాడు.
అదే సమయంలో ఏటీఎం బయటి నుంచి పోలీస్ అనే అరుపురావడంతో దుండగుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇంతలో కట్లు వదులు చేసుకున్న సెక్యూరిటీ గార్డు షహబుద్దీన్ వేటకొడవలి చేజిక్కించుకుని అతని వెంటపడి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. దీంతో అతనిని చికిత్సకు ఆసుపత్రికి తరలించిన పోలీసులు అతని పేరు సందీప్ అని అతని మిత్రుడితో పాటు ఏటీఎం చోరీకి యత్నించాడని తెలుసుకున్నారు. బైక్ పై ఏటీఎం బయట కాపలా ఉండి పరారైన సందీప్ స్నేహితుడికోసం గాలిస్తున్నారు. ప్రాణాలకు తెగించి ధైర్యంగా దొంగను పట్టుకున్న సెక్యూరిటీ గార్డును అందరూ అభినందిస్తున్నారు.