: 'బాబు రావాలి... జాబు రావాలి' అని యువత అంటున్నారు: చంద్రబాబు


"మట్టిలో మాణిక్యాలు యువత... విద్యావంతులు మన యువత... అంతా యువ కిశోరాలే! అలాంటి మా తమ్ముళ్లను వదిలిపెట్టి జీవితంలో ముందుకు వెళ్లను" అని చంద్రబాబు నాయుడు శపథం చేశారు. అందుకే రాష్ట్రంలో ప్రజలు 'బాబు రావాలి... జాబు రావాలి' అంటున్నారని ఆయన చమత్కరించారు. తనకు పదవి ముఖ్యం కాదని, గౌరవం ముఖ్యమని బాబు స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు.

తాము అధికారంలో ఉండగా చదువుకు, ఉద్యోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చామని అన్నారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టింది టీడీపీయేనని చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆ ప్రాంతనేతలే సమాధానమిస్తూ హైదరాబాద్ పైనా, తెలంగాణపైనా మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదని చెప్పారని అన్నారు. దమ్ముంటే చర్చకు రమ్మని సవాలు విసిరితే కేసీఆర్ ఫాం హౌస్ లో పని ఉందని వెళ్లిపోయాడని ఆయన ఎద్దేవా చేశారు.

అభివృద్ధి జరిగితే ఉద్యోగాలు, సంపద వస్తాయని బాబు తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ కు అన్ని అవకాశాలు వస్తున్నాయంటే దాని ఘనత రాజశేఖర్ రెడ్డిదో, కేసీఆర్ దో, 16 నెలలు జైలులో ఉన్న జగన్ దో కాదని, అది కేవలం టీడీపీదేనని ఆయన గర్వంగా చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ను, శ్మాశానాంధ్రగా, మద్యాంద్రగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని మళ్లీ ముందుకు నడిపించే స్థైర్యం టీడీపీకి తప్ప మరెవరికీ లేదని ఆయన అన్నారు. 'నాకు ఆస్తులున్నాయని పలు మార్లు ఆరోపణలు చేశారు. ఆ ఆస్తి ఎక్కడుందో చెబితే దానిని మీకే రాసిస్తా'నని ఆయన సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News