: విద్యార్థుల ప్రతిభను వెలికితీసే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్
కాలేజి విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసి, ప్రోత్సహించేందుకు '25 ఫ్రేమ్స్ స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్' పేరుతో లఘు చిత్రాల పోటీని నిర్వహిస్తున్నారు. ఈ పోటీని విశాఖకు చెందిన మిలీనియం సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్, హైదరాబాదుకు చెందిన డీక్యూ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు ఈ పోటీకి అర్హులు.
ఈ పోటీలకు జనవరి 20 వరకు ఎంట్రీలు స్వీకరిస్తామని, 25న విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో బహుమతుల ప్రదానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేవారికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని చెప్పారు. ఈ పోటీలో పాల్గొనే వారు తమ లఘు చిత్రం నిడివి 10 నిమిషాలు దాటకుండా చూసుకోవాలని కోరారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన సినీనటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ, ప్రతిభ ఉన్నా చాలామందికి దాన్ని ప్రదర్శించడానికి అవకాశం రాదని... అలాంటి వారికి ఈ పోటీ ఓ బంగారు అవకాశమని చెప్పారు.