: హరికృష్ణ యాత్ర ఎటెళ్లింది..?
నందమూరి హరికృష్ణ యాత్ర ఏమైంది? రాష్ట్ర విభజనను నిరసిస్తూ.. తెలుగు జాతి ఐక్యత కోసం పోరాడిన నందమూరి తారకరామారావు కొడుకుగా హరికృష్ణ ఆగస్టు 22న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగు జాతి సమైక్యత కోసం త్వరలోనే యాత్ర చేపడతానని ప్రకటించారు. కానీ, నాలుగు నెలలు దాటిపోయినా ఆయన యాత్ర ఆచూకీ లేకుండా పోయింది.
నిజానికి తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న.. ఎన్టీఆర్ స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి హరికృష్ణ యాత్ర ప్రారంభించాలని భావించారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పారు. ఆయన పుట్టిన రోజు దాటిపోయింది. యాత్ర చక్రం మాత్రం కదల్లేదు. హరికృష్ణ యాత్ర వల్ల పార్టీకి నష్టమని చంద్రబాబు భావించినట్లు సమాచారం. దీంతో ఆయన యాత్రకు పార్టీ పరంగా సహకారం అందించవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది.
కుటుంబ పరంగా కూడా సహకారం లేదని మరో వాదన వినిపిస్తోంది. ఏదైమైనా దూకుడుగా రాజీనామా చేసి యాత్ర చేస్తానని ప్రకటించిన హరికృష్ణ మౌనంగా ఉండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా తనకు ప్రజాగర్జనకు ఆహ్వానం రాలేదని ఆయన ప్రకటించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా మాట్లాడినందునే తనను పక్కన పెట్టారని హరికృష్ణ ఆరోపించారు.