: నిమిషాల్లో ఫర్నీచర్ చేయవచ్చు!
మీకు కావాల్సిన ఫర్నీచర్‌ను నిమిషాల్లో తయారుచేసేయవచ్చు. అదేంటి ఫర్నీచర్‌ను నిమిషాల్లో ఎలా తయారుచేయగలం? అని మీకు అనుమానంగా ఉందా... అలాంటి సరికొత్త ఫర్నీచర్‌ను పరిశోధకులు తయారుచేశారు. ఈ ఫర్నీచర్‌కు సంబంధించిన విడి భాగాలను తెచ్చుకుని చక్కగా ఎలాంటి డ్రిల్లింగ్, స్క్రూ డ్రైవర్ లేకుండా మీరే చక్కగా ఇలా బిగించేసుకోవచ్చని దీన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు.
డచ్‌కు చెందిన బెంజమిన్ వెర్మూలెన్ అనే నమూనాకర్త ఒక కొత్తరకం సామగ్రిని అభివృద్ధి చేశారు. ప్లాట్ ప్యాక్ ఫర్నీచర్‌గా చెబుతున్న ఈ కొత్తరకం సామగ్రితో ఎలాంటి పనిముట్లు అవసరం లేకుండా నిమిషాల్లో కుర్చీ, బల్ల, కేబినెట్ వంటివి తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. భవిష్యత్ తరానికి చెందిన ఫర్నీచర్‌గా పిలుస్తున్న దీన్ని మేగ్నటిక్ అసిస్టెడ్ జియోమెట్రి (ఎంఏజీ) సాయంతో తయారుచేశారు.
చాలావరకూ వినియోగదారులు డబ్బు ఆదా చేయడానికి విడిభాగాలను కొనుక్కుని తామే స్వయంగా బిగించుకుంటారు. దీన్ని ప్లాట్ ప్యాక్ ఫర్నీచర్‌గా పిలుస్తారు. ఇలాంటి ఫర్నీచర్‌ను బిగించడానికి డ్రిల్లింగ్ మిషను, స్క్రూడ్రైవర్ వంటి పనిముట్లు అవసరం అవుతాయి. అలాంటి పనిముట్ల అవసరం లేకుండా కేవలం అయస్కాంతం సాయంతో ఒకదానికి మరొకదాన్ని అతికించడమే ఈ కొత్తరకం ఫర్నీచరులో ఉండే విధానం. ఈ కొత్త ఫర్నీచరును ఉక్కు, చెక్కతో తయారుచేశామని వెర్మూలెన్ చెబుతున్నారు.