: హజారేతో కూడా చెప్పాను.. రాజకీయాలు మారుద్దాం: కేజ్రీవాల్
ఢిల్లీలోని సర్కార్ ను కేవలం అధికారులు, రాజకీయ నేతలే నడపాలనే దుష్ట సంప్రదాయాన్ని పారద్రోలదామని ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని కోటిన్నర మంది ప్రజలు కలిసి సర్కార్ ను నడిపిద్దామని సూచించారు. గతంలో రెండేళ్ల క్రితం అన్నా హజారే ఇదే రాంలీలా మైదాన ప్రాంగణంలో కలిసి తప్పుడు రాజకీయాలను మార్చేందుకు, అవినీతిని అంతం చేసేందుకు ఓ చట్టం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, కానీ జరిగిన అన్ని పరిణామాలను తామంతా ప్రత్యక్షంగా చూశామని ఆయన అన్నారు.
దేశంలో రాజకీయం మారనంతవరకు దేశం తల రాత మారదని తాను చాలా సార్లు అన్నా హజారేతో చెప్పానన్నారు. మనం రాజకీయాల్లోకి వెళ్లాలి, అక్కడ ఉన్న చెత్తను పారద్రోలాలని చెప్పానని, ఆయన దానిని నిరాకరించారని గుర్తు చేసుకున్నారు. అయినప్పటికీ తాము ధైర్యంగా ముందడుగు వేసి ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని మోస్తూ విజయం సాధించామని ఇప్పటి నుంచి తాము మరింత పోరాడాల్సి ఉందని కేజ్రీవాల్ తెలిపారు.