: నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బీ-1 బోగీలో మంటలు: 23 మంది సజీవ దహనం
అనంతపురం జిల్లా కొత్త చెరువు రైల్వే స్టేషన్ వద్ద నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఏసీ బీ-1 బోగీలో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 23 మంది సజీవ దహనమయ్యారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ధర్మవరం ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. బీ-1 బోగీలో 64 మంది ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. మరో బోగీకి కూడా మంటలు వ్యాపించాయి. ఏసీ బోగీలో పలువురు ప్రయాణీకులు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. రెండు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
ఈ ఎక్స్ ప్రెస్ రైలు బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతుండగా ఈ తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ధర్మవరం, పుట్టపత్రి ఆసుపత్రి సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. మంటలు రావడంతో ప్రయాణీకులు కొంతమంది దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా బీ-1 బోగీ మంటల్లో పూర్తిగా దగ్ధమయింది. కలెక్టర్ లోకేష్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.