: ఇలాంటి వారికి త్వరగా మెదడు దెబ్బతింటుందట!


మెదడు పనితీరు సాధారణంగా ఒక వయసు వచ్చిన తర్వాత మందగిస్తుంది. అందునా మగువల్లో ముఖ్యంగా మద్యం తాగేవారికి, పొగతాగేవారికి తొందరగా మెదడు పనితీరు మందగించడం మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు ఎక్కువమంది ఇళ్లల్లో పెద్దగా శారీరక శ్రమ చేయకుండా కూర్చుంటారు. ఇలాంటి వారికి కూడా మెదడు పనితీరు మందగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మద్యం ఎక్కువ తాగేవారికి, పొగతాగేవారికి, అసలు శారీరక శ్రమ అనేది లేకుండా బద్దకంగా కూర్చుని ఉండే మహిళలకు మెదడు అతి త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇలాంటి వారికి 45 ఏళ్లనుండి మెదడు పనితీరు మందగించడం మొదలవుతుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు.

క్వీన్స్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మద్యపానం, ధూమపానానికి అలవాటు పడిన, శారీరక శ్రమ చేయకుండా ఉండే మగువల జ్ఞాపకశక్తికి సంబంధించిన పరీక్షలను నిర్వహించారు. ఈ పరిశోధనల్లో మహిళల జీవనశైలి వారి మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్టు తేలింది. వీరు ఎంపిక చేసుకున్న మహిళలపై సుమారు ఎనిమిదేళ్లకు పైగా పరిశోధనలను నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. వీరు ఎంపిక చేసుకున్న మహిళల్లో మోతాదు మేరకు మద్యం తీసుకుని క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవారు, మద్యపానానికి విపరీతంగా అలవాటుపడి బద్దకమైన జీవనశైలికి అలవాటుపడిన వారు కూడా ఉన్నారు. వీరందరికీ జ్ఞాపకశక్తికి సంబంధించిన పరీక్షలు, వారి ఆలోచనా సరళిని ప్రతిబింబించే పలు రకాలైన పరీక్షలను నిర్వహించిన తర్వాత ఇలాంటి అలవాట్లుండే మహిళలకు 45 ఏళ్ల వయసునుండే మెదడు పనితీరు మందగించడం మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మగువలు మెదడును ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పనిచేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది, అలాగే మద్యానికి, పొగకు దూరంగా ఉండడం కూడా మంచిదే!

  • Loading...

More Telugu News