: విభజన ప్రక్రియను విరమించుకోవాలి: రాష్ట్రపతితో సీమాంధ్ర ఎమ్మెల్యేలు
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతితో సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. విభజన ప్రక్రియను వెంటనే ఆపివేయాలని కోరుతూ ఆరు పేజీల నివేదికను వారు సమర్పించారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం విభజన ప్రక్రియను చేపట్టిందని వారు దుయ్యబట్టారు. సీమాంధ్రలో ప్రజలు విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలను వారు రాష్ట్రపతికి వివరించారు. ముసాయిదా బిల్లులో పేర్కొన్న అంశాలు రాజ్యాంగానికి అనుగుణంగా లేవని, ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదని వారు చెప్పారు. హైదరాబాదు ఆదాయంలో అత్యధికంగా సీమాంధ్ర ప్రాంతం నుంచి వస్తోందని, హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్ర కష్టార్జితం ఉందని విన్నవించారు. ఆదాయంలో వాటా పంచకుండానే విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లటం తగదని చెప్పారు.