: బాల్యంలో బరువు పెరిగితే ఒత్తిడి ఎక్కువేనట!
కొందరు చిన్న పిల్లలు ఎక్కువ బరువుంటారు. ఇలాంటి పిల్లల్లో ఒత్తిడి పాళ్లు ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇతర తక్కువ బరువుండే పిల్లలతో పోల్చుకుంటే బరువు ఎక్కువగా ఉండే పిల్లల్లో ఒత్తిడి హార్మోను అయిన కార్టిసోల్ విడుదల స్థాయి ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
సాధారణంగా ఎవరైనా ఒత్తిడికి గురైతే వారి శరీరంలో కార్టిసోల్ హార్మోన్ విడుదలవుతుంది. అయితే బాల్యంలోనే ఎక్కువ బరువుంటే చిన్నారుల్లో ఈ హార్మోన్ విడుదల స్థాయి ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. సాధారణ బరువుండే చిన్నారుల్లో కంటే కూడా ఎక్కువ బరువుండే చిన్నారుల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. తరచూ ఒత్తిడికి గురయ్యేవారి రక్తంలో కొంతకాలానికి ఈ హార్మోను పేరుకుపోయి చివరికి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇందుకుగాను వారు కొందరు చిన్నారుల శిరోజాలను విశ్లేషించారు. నిజానికి శిరోజాలను ఒత్తిడి స్థాయిని ప్రతిబింబించే సంకేతాలుగా చెబుతారు. ఈ విశ్లేషణలో స్థూలకాయులైన పిల్లల్లో కార్టిసోల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమైంది.