: కేకలు, అరుపులతో పనులు కావు.. తాత్కాలిక ఆనందమే: శైలజానాథ్


కేకలు, అరుపులతో పనులు పూర్తి కావని..వాటివల్ల తాత్కాలిక ఆనందం మాత్రమే కలుగుతుందని మంత్రి శైలజానాథ్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కొన్ని పార్టీలు కాంగ్రెస్ నేతలను ప్రశ్నిస్తున్నాయని, అది సరికాదని అన్నారు. టీడీపీ వారు ఇప్పటికీ తమ అధినేతను సమైక్యంగా ఉంచాలని చెప్పలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఆర్టికల్ 3 ద్వారా విభజించాలని డిమాండ్ చేసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్... ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు.

తాము మాత్రం తమ అధిష్ఠానాన్ని ఎదిరించామని ఆయన గుర్తు చేశారు. సీఎంపై వ్యాఖ్యలు చేసేముందు టీడీపీ నేతలు ఉచితానుచితాలు ఆలోచించాలని శైలజానాథ్ హితవు పలికారు. ఆ రోజు కానీ, ఈ రోజు కానీ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కాంక్షించింది కాంగ్రెస్సేనని ఆయన అన్నారు. సీఎంపై విమర్శలు చేయడం, వ్యంగ్యంగా ఉన్న బొమ్మలు ప్రదర్శించడం సరికావని అన్నారు.

రాష్ట్ర సమైక్యత, సమగ్రత కోసం సీమాంధ్ర నేతలంతా సంతకాలతో రాష్ట్రపతికి, కాంగ్రెస్ అధ్యక్షురాలికి లేఖలు పంపిన సంగతి గుర్తుంచుకోవాలని శైలజానాథ్ చెప్పారు. ఇప్పటికైనా రాజకీయాలు, చౌకబారు ఆరోపణలు మానండని ఆయన హితవు పలికారు. రాష్ట్రపతి ఆదేశానుసారం 23వ తేదీ వరకు అసెంబ్లీ జరిపాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జెండాలు, అజెండాలు పక్కన పెట్టి ఏకంకావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భవిష్యత్తును కాపాడే సమయం కనుక వ్యంగ్యానికి తావులేకుండా ఆచరణాత్మక ప్రణాళికతో పని చేయాలని ఆయన సూచించారు.

చంద్రబాబు నాయుడుకి తప్ప మిగిలిన టీడీపీ నేతలందరి కృషికి అభినందనలు తెలిపారాయన. తాము గతంలోనే సమైక్య తీర్మానం పెట్టాలని స్పీకర్ కు నోటీసిచ్చామని, అవసరమైతే సీఎంకు కూడా నోటీసు ఇస్తామని తెలిపారు. తమకు కూడా బిల్లుపైనా, బిల్లు వచ్చిన తీరుపైనా చాలా అనుమానాలు ఉన్నాయని, అయితే అవి అసెంబ్లీలో చర్చ సందర్భంగా లేవనెత్తుతామని అన్నారు. అసెంబ్లీలో ప్రతి ఒక్కరి స్టేట్ మెంట్ రికార్డవుతుందని శైలజానాథ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News