: స్తనసౌందర్యానికే కాదు దేహసౌందర్యానికి కూడా బ్రా
మగువల స్తన సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపజేయడానికి బ్రా ఎక్కువగా వాడుతుంటారు. అదే బ్రా మీ శరీరానికి సంబంధించి కూడా మిమ్మల్ని తగు హెచ్చరికలు చేస్తుంటే... అలాంటి బ్రా సూపర్! ఇలాంటి ఒక సరికొత్త బ్రాను పరిశోధకులు తయారుచేశారు. ఈ బ్రా మీరు అతిగా ఆహారాన్ని తీసుకోకుండా కంట్రోల్ చేసి మిమ్మల్ని నాజూకుగా ఉంచడంలో మీకు ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
చాలామంది భోజనం తిన్నా కూడా మళ్లీ స్నాక్స్ కనపడగానే చల్లగా వాటిని లాగించేస్తుంటారు. దీంతో ఆహారంపై అదుపు తప్పుతుంది. ఫలితంగా స్థూలకాయం సంప్రాప్తిస్తుంటుంది. అలాకాకుండా మితాహారం తీసుకునేలా అదుపులో ఉంచడానికి ఈ బ్రా మగువలకు చక్కగా ఉపకరిస్తుందట. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్కు చెందిన శాస్త్రవేత్తలు మహిళలకోసం ఒక సరికొత్త స్మార్ట్ బ్రాను అభివృద్ధి చేశారు. ఈ బ్రా మగువల మనస్థితిలోని మార్పులను గుర్తించి వారు అతిగా తినడాన్ని నివారిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
హృదయం, చర్మ క్రియలను పర్యవేక్షించేందుకు వీలుగా ఈ బ్రాలో సెన్సార్లను అమర్చినట్టు యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఎమ్.సి.ష్రాఫెల్ చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ద్వారా ఈ సెన్సార్లు సేకరించిన సమాచారం దీనిని ధరించిన మహిళకు చేరుతుందని ష్రాఫెల్ చెబుతున్నారు. 'ఫుడ్ అండ్ మూడ్'పై చేసిన పరిశోధన ఈ బ్రాను తయారుచేయడానికి ఉపకరించింది. ఈ పరిశోధనలకు అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ సహకారాన్నందించాయి.