: తండ్రులు కూడా ఆహార నియమాలు పాటించాలట!
గర్భంతో ఉన్న సమయంలో తల్లులు పలు ఆహార నియమాలను పాటిస్తుంటారు. చక్కగా గర్భంలో బిడ్డ ఎదుగుదలకు ఉపకరించే ఆహార పదార్ధాలను తీసుకుంటుంటారు. అయితే అసలు తండ్రి కావాలనుకునేవారు కూడా ముందుగా తమ ఆహారపు అలవాట్లను గురించి ఒకసారి పరిశీలించుకోవాలట. ఎందుకంటే, తండ్రి కావాలనుకునేవారు విటమిన్ లోపంతో ఉంటే వారివల్ల సంక్రమించే సంతానం కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉందని ప్రత్యేక అధ్యయనంలో తేలింది.
మెక్‌గిల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తండ్రులు తీసుకునే ఆహారం కూడా వారికి పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నట్టు తేలింది. వీరు ఎలుకలపై చేసిన పరిశోధనలో విటమిన్ బి9 (ఫోలేట్) లోపించిన ఆహారాన్ని తిన్న మగ ఎలుకలకు పుట్టిన సంతానం పలు లోపాలతో పుట్టినట్టు తేలింది. విటమిన్ బి9 లోపించిన ఎలుకల ద్వారా కలిగిన సంతానానికి పుట్టుకతోనే వచ్చే లోపాల ముప్పు 30 శాతం ఎక్కువగా ఉన్నట్టు వీరి అధ్యయనంలో తేలింది. ఎలాగంటే వీర్యంలోని డిఎన్‌ఏ మీదుండే రసాయన మిశ్రమాలు జన్యువులను పనిచేయించే మీటల్లాగా పనిచేస్తాయి. ఇవి ఆహారం ఇతర అలవాట్లు, అనుభవాల ద్వారా ప్రభావితమవుతాయి. ఈ మీటలు దెబ్బతింటే పిండం అభివృద్ధి దశలో కీలక జన్యువుల పనితీరు అస్తవ్యస్తం అవుతుంది. ఇది పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
విటమిన్ బి9 లోపం వల్ల పుట్టే సంతానానికి పుర్రె ఎముకలతోబాటు వెన్ను లోపాలు వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గర్భంతో ఉండే తల్లులే కాకుండా తండ్రి కావాలనుకునేవారు కూడా తాము తీసుకునే ఆహారం పట్ల కాస్త అవగాహనతో ఉంటే మంచిదే.