: మీ ఆహారంలో ఇవన్నీ కూడా ఉండాలి
మీ రోజువారీ ఆహారంలో ఎలాంటి ఆహార పదార్ధాలను తీసుకుంటున్నారు... అంటే విటమిన్లు, కాల్షియం, ఐరన్ అంటూ కొన్నింటి గురించి మాత్రమే చాలామంది చెబుతారు. వాటిలో జింక్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ జింకు లోపం వల్ల కూడా బోలెడు సమస్యలను మనం ఎదుర్కొనాల్సి వస్తుందట. మన శరీరంలోని రక్తంలో గ్లూకోజు నియంత్రణకు, జీవ క్రియల వేగం స్థిరంగా ఉండడానికి, రోగనిరోధక శక్తి పెంపొందడానికి, వాసన, రుచి వంటి జ్ఞానాలు తగ్గకుండా ఉండడానికి జింక్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పురుషులకు ప్రొస్టేట్ గ్రంధి పనితీరు దెబ్బతినకుండా చూడడంలోను, టెస్టో స్టీరాన్ హార్మోన్ స్థాయిలు పడిపోకుండా చూడడంలో జింక్ బాగా ఉపకరిస్తుంది.
వేన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో జింక్ తక్కువగా తీసుకునే వారిలో టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయిలు పడిపోయినట్టు తేలింది. అలాగే జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రొస్టేట్ క్యాన్సర్ కణజాలంలో జింక్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు తమ పరిశోధనలో గుర్తించారు. శరీరంలోని అన్ని అవయవాలు, కణాల్లో కూడా జింక్ ఉన్నప్పటికీ ప్రొస్టేట్ గ్రంథిలో, ఎముకలోను ఎక్కువ మోతాదులో జింక్ కనబడుతుంది. జింక్‌ను తక్కువగా తీసుకునే పురుషుల్లో ప్రొస్టేట్ వాపు, క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వయసు పెరిగేకొద్దీ వ్యాయామాలు చేయడం చాలామంది తగ్గిస్తుంటారు. అలాగే ఆహార నియమాలు కూడా మారిపోతుంటాయి. ఇవన్నీ కూడా జింక్ లోపానికి దారితీస్తాయి.
మన శరీరం తనకు తానుగా జింక్‌ను ఉత్పత్తి చేసుకోలేదు. కాబట్టి మన ఆహారంలోనే జింక్‌ను తగు మోతాదులో ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అలాగే జింక్ ఎక్కువైనా కూడా ప్రమాదమే. కాబట్టి రోజుకు కనీసం యాభై మిల్లీగ్రాములకన్నా తక్కువ జింక్ మన శరీరానికి అవసరం. ఇది ఎక్కువగా మాంసం, చికెన్, చిక్కుళ్లు, గింజధాన్యాలు, పీతలు, పుట్టగొడుగులు, పెరుగు, పాలకూర, నువ్వులు, గుమ్మడి గింజలు, పొట్టు తీయని ధాన్యాలు వంటి వాటిలో లభిస్తుంది. ఇలాంటి వాటిని కూడా తగు మోతాదులో మన ఆహారంలో భాగంగా చేసుకుంటే మనకు జింక్ లోపం ఉండదు. అలాగే ప్రొస్టేట్ గ్రంధికి సంబంధించిన సమస్య కూడా తలెత్తదు.