: అవిశ్వాసానికి సర్వం సిద్ధం: కేంద్రానికి సబ్బం హరి సవాల్
అవిశ్వాస తీర్మానానికి తమ వ్యూహమంతా సిద్ధంగా ఉందని, పార్టీ అధిష్ఠానానికి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి సవాల్ విసిరారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేక కుయుక్తులకు తెరతీస్తోందని మండిపడ్డారు. వారి పన్నాగాలను పసిగట్టామని, అందుకే తాము ఈ నెల 17 వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుబట్టనున్నామని అన్నారు.
ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆరుగురు సంతకాలు చేసి సిద్ధంగా ఉన్నారని అన్నారు. తాజాగా నిన్న రాత్రి సమాజ్ వాదీ పార్టీ లోక్ పాల్ బిల్లుపై వున్న ఆగ్రహంతో సీమాంధ్రులకు మద్దతు ఇస్తామని చెప్పిందని అన్నారు. అయితే వారంతా సభకు వచ్చి అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టే సమయంలో ఓ కాంగ్రెస్ నేత వచ్చి వారిని బయటకు తీసుకువెళ్లాడని, తాము అన్నీ గమనిస్తున్నామని ఎంపీ సబ్బం స్పష్టం చేశారు.
మీడియా మిత్రులు మీరు ఆరుగురే కదా, ఎలా అవిశ్వాసం పెడతారని అడుగుతున్నారని... తాము నడవడం ప్రారంభించామని, ఇప్పటికిప్పుడు మాతో పాటు కలిసి నడిచేందుకు శివసేన, అకాలీదళ్, బీజేడీ, ఫార్వర్డ్ బ్లాక్, ఏఐఏడీఎంకే, శ్రీరాములు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వారంతా 36 మంది అవుతున్నారని.. కాంగ్రెస్ రెబల్ ఎంపీలైన తాము, టీడీపీ, వైఎస్సార్ సీపీ మొత్తం కలిసి 49 మంది అవుతున్నామని అన్నారు.
తమకు ఎస్పీ మద్దతిస్తుందని మరి కొన్నిరాష్ట్రాలు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తృణముల్, ఇతర పార్టీలు అన్నీ కలిస్తే కేంద్రం దిమ్మతిరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని చూసిన తాము, మిగిలిన నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండి సభకు ఒకళ్లిద్దరం వచ్చి తమ వ్యూహాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని, ఫిబ్రవరి సెషన్ లో కూడా బిల్లు రాకుండా చేస్తామని సబ్బం హరి తెలిపారు.