: అజెండాలో లేకుండానే బిల్లు ప్రవేశపెట్టారు: పయ్యావుల
అసెంబ్లీ సమావేశ అజెండాలో లేకుండానే రహస్య అజెండాగా తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బిల్లును అసెంబ్లీలో 10 గంటలకు ప్రవేశపెడతారని తెలంగాణ సభ్యులకు మాత్రమే సమాచారం ఉందని అన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు.
దీని కారణంగానే తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులంతా 10గంటలకే అసెంబ్లీ లాబీల్లోకి వచ్చారని అన్నారు. సదాశివంకి రక్షణగా నిలబడ్డారని, కావాలంటే వీడియో ఫుటేజీలు చూసుకోవాలని సూచించారు. అజెండాలో లేకుండా, కొందరికి చెప్పి బిల్లు ప్రవేశపెట్టడంతోనే తాము ప్రతిఘటించామని పయ్యావుల తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు, మరి కొంతమంది తెలంగాణ నేతలు బిల్లుపై చర్చ ప్రారంభమైందని అంటున్నారనీ, వాస్తవానికి ఇంకా ప్రారంభం కాలేదని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబడిందే తప్ప చర్చ ప్రారంభం కాలేదని అన్నారు. సభలో బిల్లు ప్రవేశపెట్టినంత మాత్రాన చర్చ జరిగినట్టు కాదని పయ్యావుల తెలిపారు. సభ ఆమోదంతోనే చర్చ ప్రారంభం కావాలని, అప్పుడు మాత్రమే అది ఆమోదయోగ్యమని అన్నారు. దీనిపై బీఏసీలో నిర్ణయం తీసుకోబడుతుందని పయ్యావుల తెలిపారు. సభలో శ్రీధర్ బాబు మాట్లాడినంత మాత్రాన చర్చ జరిగినట్టు కాదని గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితేనే 20 రోజులు విరామమిస్తారని, అలాంటిది సీమాంధ్ర ప్రజల జీవితాలను ప్రభావితం చేసే బిల్లు గంటల్లో ఎలా ఆమోదం పొందుతుంది? అని ప్రశ్నించారు. శాసన సభను నిరవధికంగా వాయిదా వేసి మళ్లీ చర్చకు పిలవాలని ఆయన సూచించారు. సీమాంధ్ర ప్రజలకు భవిష్యత్తులో నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉందని అన్నారు.