: మీ పిల్లలను కాసేపు వీడియో గేమ్స్ ఆడుకోనివ్వండి
వీడియో గేమ్స్ ఆడుకునేందుకు ఉత్సాహం చూపించని పిల్లలు ఎవరుంటారు...? పిల్లలందరికీ వీడియో గేమ్స్ ఆడాలనే ఆశ ఉంటుంది. కానీ, తల్లిదండ్రులు వాటిని పిల్లలకు దూరంగా ఉంచుతుంటారు. వీడియో గేములు ఆడడం వల్ల పిల్లల్లో ఆవేశం ఎక్కువవుతుందని, వారిలో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని, ఇలా వివిధ రకాల పరిశోధనల్లో వెలువడిన అంశాలను దృష్టిలో ఉంచుకుని పిల్లలను వీడియో గేములను ఆడనివ్వకుండా చూస్తుంటారు. కానీ కనీసం కొంతసేపైనా పిల్లలను వీడియో గేములను ఆడనివ్వాలట. ఇలా చేయడం వల్ల పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అన్నీ కాదండోయ్... కొన్ని రకాల గేముల వల్ల మాత్రమే ఇలాంటి ప్రయోజనం ఉంటుందట.
కొన్ని రకాల వీడియో గేములను ఆడడం వల్ల పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. సామాజిక, విద్యా ప్రయోజనాలున్న వీడియో గేములను ఆడడం వల్ల చిన్న పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయని ఎడిత్ కొవాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మార్క్ మెక్‌మహోన్ చెబుతున్నారు. అన్నీ కాకుండా వయసు నిబంధనలు, గేమ్స్‌లో ఉన్న భావం అంటే థీమ్ ఆధారంగా మంచి గేములను చిన్న పిల్లలచేత ఆడించాలని, అన్ని గేములను ఆడించడం మంచిది కాదని మెక్‌మహోన్ చెబుతున్నారు. ఇలా ఎంపిక చేసుకున్న వీడియో గేములను ఆడడం వల్ల అవి పిల్లల మానసిక వికాసానికి తోడ్పడుతున్నట్టు 91 శాతం మంది, ఒత్తిడిని తగ్గిస్తున్నట్టు 85 శాతం మంది పేర్కొన్నట్టు డిజిటల్ ఆస్ట్రేలియా 2014 నివేదిక చెబుతోంది.