: కట్టుకున్న భర్తే అత్యాచారం చేసి, హింస పెట్టాడని కన్నీరు పెట్టిన కొత్త పెళ్లికూతురు
కొద్ది రోజుల క్రితమే ఆ అమ్మాయి అత్తవారింట అడుగుపెట్టింది. పెళ్లి సమయంలో భర్త తనను బాగా చూసుకొంటానని తల్లిదండ్రులతో చెప్పిన మాటలు నిజమేనని నమ్మింది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భర్తగా రావడంతో తన జీవితం సాఫీగా సాగుతుందని సంబరపడుతూ థాయ్ లాండ్ విమానం ఎక్కింది. అయితే, అక్కడికెళ్లాక తెలిసింది.. తన ఊహలు, ఆశలు, కన్న కలలు కల్లలయ్యాయని..!
దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 29న పాలెం ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువతికి ఐటీ పరిశ్రమలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పెళ్లయింది. నవ వధువు హనీమూన్ లో తొలి రాత్రే తనను భర్త చెప్పుకోలేని విధంగా చిత్రహింసలు పెట్టాడని, అసహజ పద్ధతుల్లో మైథునం చేశాడని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. థాయ్ లాండ్ లో మద్యం తాగమని తనను బలవంతం చేశాడని, నిరాకరించినందుకు తన చెంప ఛెళ్లుమనిపించాడని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పింది. అంతేగాక, తన మాట వినకపోతే వ్యభిచార రొంపిలోకి దింపుతానని బెదిరించాడని చెప్పింది.
అక్కడి నుండి వచ్చిన వెంటనే తన ఆవేదనను సోదరుడికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. తనను వెంటనే పుట్టింటికి తీసుకువెళ్లాలంటూ ప్రాథేయపడుతూ.. భర్తను చూస్తే భయమేస్తోందని చెప్పింది. చివరకు కుటుంబ సభ్యులతో కలిసిన తర్వాత ఢిల్లీ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు విషయం తెలుసుకున్న భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.