: దిగ్విజయ్ ... వీటికి నీ దగ్గర సమాధానముందా?: బాబు సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, దిగ్విజయ్ సింగ్ పదే పదే రాజ్యాంగ బద్దంగా, చట్టబంద్దంగా రాష్ట్ర విభజన జరుగుతుందని అంటున్నారని, అసలు రాజ్యాంగ బద్ధం అంటే వారు అవలంభించిన ఈ విధానాలు ఇవేనా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ ఏర్పాటుపై ఏకాభిప్రాయం సాధించామని అంటున్నారు. అంటే ఏడుగురు జీవోఎం సభ్యులు కూర్చుని మాట్లాడుకోవడమేనా? అని ప్రశ్నించారు. వారం రోజుల్లో అధికారుల నుంచి నివేదికలు రప్పించుకుని వారికి నచ్చింది, తోచింది సూచించడమే ఏకాభిప్రాయమా? అని నిలదీశారు. అఖిలపక్షం సమావేశం పేరిట పార్టీలన్నింటినీ పిలిచి ఐదేసి నిమిషాలు మాట్లాడించడమే ఏకాభిప్రాయమా? అని అడిగారు.