: మోడీకి లీగల్ నోటీసు పంపిన కర్ణాటక కాంగ్రెస్ నేత
గాంధీ కుటుంబానికి 'రాత్రి కాపలాదారు' (నైట్ వాచ్ మెన్) అంటూ ప్రధాని మన్మోహన్ సింగ్ పై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటీసు జారీ అయింది. మోడీ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ కర్ణాటక స్థానిక కాంగ్రెస్ నేత.. లీగల్ నోటీసు జారీ చేశారు.
నోటీసు అందిన మూడు రోజుల్లోగా మోడీ క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ సభ్యుడు కెకె బెన్సన్ హెచ్చరించారు. లేకపోతే ఆయనపై కోర్టులో పరువునష్టం దావా వేస్తానన్నారు. ఈ సందర్భంగా నోటీసును మీడియాకు విడుదల చేసిన బెన్సన్.. 'రాత్రి కాపలాదారు' అని వర్ణించి మన్మోహన్ ను అవమానించారన్నారు.
ప్రజల్లో ప్రధానికున్న ఖ్యాతిని, ప్రజాభిమానాన్ని కించపరిచారని మండిపడ్డారు. ఈ నెల 3న ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన మోడీ.. కాంగ్రెస్ కుటుంబం కోసం ఆర్ధికవేత్త అయిన ఓ వ్యక్తిని రాత్రి కాపలాదారుగా ప్రధాని పదవిలో నియమించిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.