: మండేలాకు కిరణ్, చంద్రబాబుల సంతాపం
శాసనసభలో నల్లసూరీడు మండేలాకు సీఎం కిరణ్ సంతాపం ప్రకటించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా, మానవజాతికి ఎనలేని కృషి చేసిన మండేలా మృతికి సభ సంతాపం ప్రకటిస్తోందని సీఎం కిరణ్ తెలిపారు. ఆయన మృతి స్వేచ్చ, స్వాతంత్ర్యం కోరుకుంటున్న వారికందరికీ తీరని లోటని అన్నారు.
సొంత గడ్డపై కనీసం ఓటు హక్కు కూడా లేకుండా బతుకుతున్న తన జాతి కోసం జీవితాన్ని అర్పించిన గొప్ప శక్తి మండేలా అని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మహాత్మా గాంధీకి ఏకలవ్యుడిగా, మానవజాతిలోనే ఒక ఉన్నత శిఖరంగా ఎదిగిన వ్యక్తి మండేలా అంటూ కొనియాడారు. ఆయన కృషితో దక్షిణాఫ్రికా స్వేచ్చా వాయువులు పీల్చుకుందని అన్నారు. 50 ఏళ్లకు పైగా మండేలా రాజీలేని పోరాటం చేశారని తెలిపారు. ఆయనను భారతరత్నతో గౌరవించడం మన దేశ అదృష్టమని చంద్రబాబు అన్నారు.