: పోప్ ఎంపికలో వర్గ పోరు
బెనడిక్ట్-16.. పోప్ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త పోప్ ఎంపికలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలుగా విడిపోయిన 115 మంది కార్డినళ్లు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు.
రెండు శిబిరాల్లో.. ఒకటి వాటికన్ అధికార క్యూరియా వర్గం కాగా, మరొకటి అమెరికా కార్డినళ్ల వర్గం. క్యూరియా.. బ్రెజిల్ కార్డినల్ ఒడిలో షేరర్ కు మద్దతు తెలుపుతుండగా, అమెరికా వర్గం ఏంజెలో స్కోలాను బలపరుస్తోంది. కాగా, మూడున్నర దశాబ్దాలుగా పోప్ పదవి విదేశీయులనే వరిస్తోందన్న ఇటలీ కార్డినళ్లు ఈసారి ఎలాగైనా తమ వర్గానికే పవిత్ర పదవి దక్కాలని ఆశిస్తున్నారు.
ఇదిలావుంటే, ఇటలీ వర్గమైన క్యూరియా పనిబట్టేవాడే పోప్ గా రావాలన్నది అమెరికా వర్గం అభిమతమని తెలుస్తోంది. అయితే, కఠినంగా వ్యవహరించే పోప్ ను ఎన్నుకుంటారో, అందరికీ ఆమోదయోగ్యుడైన పోప్ ను ఎన్నుకుంటారో కొద్ది రోజుల్లో తెలియనుంది. అయితే, ప్రస్తుతం పోప్ ఎంపికలో పాల్గొంటున్న కార్డినళ్లలో ఇటలీ జాతీయులు 28 మంది ఉండడంతో వారి వర్గానికే పోప్ పదవి లభిస్తుందని భావిస్తున్నారు.