: తెలంగాణపై ఆధిపత్యం కోసమే చంద్రబాబు, జగన్ ల ఆరాటం: టీకాంగ్ ఎంపీలు
వైకాపా, టీడీపీలు సందర్భానుసారంగా మాట మార్చాయని... మొదట్లో ఆ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయని టీకాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని జోస్యం చెప్పారు. టీడీపీ ఎంపీలు ఆ పార్టీ నుంచి బయటకు రావాలని గుత్తా డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో టీటీడీపీ నేతలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటారని మరో ఎంపీ రాజయ్య చెప్పారు. అందువల్ల వారు వెంటనే టీడీపీని వీడాలని కోరారు.
పార్లమెంటు సాక్షిగా, కేవలం తెలంగాణను వ్యతిరేకించడమనే సింగిల్ అజెండాతో టీడీపీ, వైకాపాలు ముందుకు పోతున్నాయని మరో ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవిశ్వాసానికి బీజేపీ మద్దతు సంపాదించడానికి ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు, జగన్ లు ఇద్దరు కలసి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేవారు. తెలంగాణ వస్తున్న తరుణంలో దాన్ని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.