: ప్రాచీన కాలంలో అక్కడ నీరుండేదట!
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అక్కడ నీరుండేదట... కానీ తర్వాత ఆ నీరు ఆవిరైపోయి... చివరికి జాడలేకుండా పోయిందట. ఇదంతా దేని గురించో ఇప్పటికే అర్థమైవుంటుంది. అంగారకుడి గురించే! చాలాకాలంగా అరుణగ్రహంపై నీటి ఆనవాలు గురించి శాస్త్రవేత్తలు ఎంతో ఆసక్తిగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిశోధనల నేపధ్యంలో అంగారకుడిపై ప్రాచీన కాలానికి చెందిన ఒక మంచినీటి సరస్సుకు సంబంధించిన ప్రత్యక్ష ఆధారాలను నాసాకు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వివరాలతో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అంగారకుడిపై జీవం ఉండి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.
నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ఇప్పటికే గేల్ బిలంలో పరిశోధనలు సాగిస్తోంది. ఇందులో భాగంగా అంగారకుడి మధ్యరేఖకు సమీపంలోని గేల్ లోయలో ఉన్న ఎల్లోనైఫ్ బే అనే ప్రాంతంలోని మడ్డిరాళ్లపై నాసాకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ద్వారా ఆ ప్రాంతంలో 360 కోట్ల సంవత్సరాల క్రితం కనీసం ఒక సరస్సు అయినా ఉండి ఉంటుందనే అంచనాకు వచ్చారు. ఈ సరస్సు వందలు, వేల సంవత్సరాలపాటు కాకున్నా కనీసం కొన్ని దశాబ్దాలపాటు ఉనికిలో ఉండివుండవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
సరస్సులోని నీటిలో కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్ వంటి కీలక మూలకాలు కలిసిపోయి ఉంటాయని వీరి పరిశోధనలో తేలింది. ఇలాంటి మూలకాలు ఉన్నప్పుడు ‘కీమోలిథోఆటోట్రోప్స్’ వంటి సరళ సూక్ష్మస్థాయి జీవం అంకురించడానికి పూర్తిస్థాయి అవకాశం ఉంటుంది. భూమిమీద గుహల్లో కూడా కీమోలిథోఆటోట్రోప్స్ సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇదేవిధంగా అంగారకుడిపై కూడా ఈ తరహా సూక్ష్మజీవి ఒకప్పుడు విస్తారంగా ఉండేదా అన్న విషయంపై నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టి సారించారు. ఈ పరిశోధనలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ సంజీవ్‌గుప్తా కూడా పాలుపంచుకుంటున్నారు.