: వంట గ్యాస్ సిలిండర్లపై పరిమితిని ఎత్తివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం
వంట గ్యాస్ కు సంబంధించి సిలిండర్లపై పరిమితి విధించిన కేంద్రం... ఇప్పుడు పరిమితిని ఎత్తివేయాలని యోచిస్తోంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. ఆర్థిక విధానాలను మార్చుకుని జనాగ్రహాన్ని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత సంవత్సరానికి వంట గ్యాస్ వినియోగదారులకు తొమ్మిది సిలిండర్లను మాత్రమే చమురు సంస్థలు సరఫరా చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై ప్రజలు అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు పలు ఆర్థిక సంస్కరణలను చేపట్టి వచ్చే సాధారణ ఎన్నికల్లో అయినా ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించుకుంది.