: మండేలా ఒక ఆలోచనల శక్తి: బరాక్ ఒబామా
నెల్సన్ మండేలా 'ఆలోచనల శక్తి' అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీర్తించారు. దక్షిణాఫ్రికాలోని జొహానెస్ బర్గ్ లో జరిగిన మండేలా సంతాప సభలో ఒబామా మాట్లాడుతూ, ఆఫ్రికా ఖండ చరిత్రలో కష్టాలను తట్టుకుని, తన దారిలో తానొక్కడే శక్తిగా నడిచిన ధీశాలి మండేలా అని స్తుతించారు. తాను నడిచిన దారిలో రాళ్లు, ముళ్లున్నా.. నమ్మిన దానిని ఆచరించడం కోసం వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టిన మహానుభావుడు మండేలా అని ఒబామా కొనియాడారు.
చరిత్రను చదవడం మాత్రమే తెలిసిన దక్షిణాఫ్రికా పౌరులకు, చరిత్ర పుటలను కూడా మార్చే సామర్థ్యాన్ని చూపించిన గొప్ప దార్శనికుడు మండేలా అని అన్నారు. ఒక జాతి మొత్తం అతనిని చూసే విలువలు నేర్చుకుంటోందని అన్నారు. వేల అనుభవాల సారం ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని ఒబామా అభిప్రాయపడ్డారు.
ఎన్నో చేదు అనుభవాలు చవిచూసిన మండేలా... వాటిని తనవాళ్లు అనుభవించకూడదని, వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడని కొనియాడారు. వ్యక్తులను రంగులను బట్టికాక వ్యక్తిత్వాన్ని బట్టి చూడాలంటూ... మనిషి తలెత్తుకునేలా చేసిన ప్రభావవంతమైన వ్యక్తి మండేలా అని పేర్కొన్నారు.