: అది నాకు తెలియదు..కానీ బిల్లు మాత్రం ఈ సభలోనే వస్తుంది: షిండే
తెలంగాణ బిల్లుపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోం శాఖ పనితీరుపై సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుపై అభిప్రాయాలు కోరేందుకు శాసనసభకు రాష్ట్రపతి ఎన్నిరోజుల గడువు ఇస్తారో తనకు తెలియదని తెలిపారు. అంతలోనే, ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు.
అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లు మళ్లీ మంత్రివర్గానికి వస్తుందని షిండే స్పష్టం చేశారు. 2004, 2009 ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఉందని ఆయన గుర్తు చేశారు. అందువల్లే కేంద్రం తెలంగాణ బిల్లును ఆమోదించిందని ఆయన స్పష్టం చేశారు. బిల్లు అసెంబ్లీకి పంపించిన తరువాత అసెంబ్లీ అభిప్రాయం చెప్పకపోతే, అప్పుడు రాష్ట్ర విభజనపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని షిండే అన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రానికి పూర్తి అధికారం ఉందని షిండే వెల్లడించారు.
సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటిసు గురించి మాట్లాడుతూ... స్పీకర్, ప్రభుత్వం ఎవరి బాధ్యత వారు నిర్వహిస్తారని షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రజా తీర్పును తాము శిరసావహిస్తామని ఆయన అన్నారు. ఢిల్లీలో పరిస్థితిని లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉందని, భవిష్యత్తులో కూడా బాగానే ఉంటుందని ఆయన తెలిపారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు తన దృష్టికి ఇంకా రాలేదని తెలిపిన షిండే, మత హింస నిరోధక బిల్లు ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు వస్తుందని అన్నారు.