: భారతీయుడి మృతితో మద్యం అమ్మకాలు నిషేధించిన సింగపూర్
సింగపూర్ లో రోడ్డు ప్రమాదంలో ఆదివారం రాత్రి ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడంతో, హాంషేర్ ప్రాంత పరిధిలోని జంక్షన్ ఆఫ్ రేస్ కోర్సులో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఈ వారాంతంలో మద్యం అమ్మకాలు, మద్యపానాన్ని నిషేధించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిషేధం ఎప్పటి వరకు అమలులో ఉంటుందనేది పోలీసులు నిర్ధారిస్తారని హోంశాఖ సెకండ్ మినిస్టర్ ఈశ్వరన్ పేర్కొన్నారు. మద్యం మత్తులో అక్కడి స్థానిక భారతీయులు ఆందోళనలకు దిగినట్లు తెలియరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
జంక్షన్ ఆఫ్ రేస్ కోర్సులో ప్రైవేట్ ట్రక్కు ఢీ కొట్టడంతో భారత్ కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు శక్తివేల్ కురవేల్ (33) మరణించడంతో 400 మంది ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు. స్థానిక భారతీయులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై దాడికి దిగడంతో హింస చెలరేగింది. ఈ ఘటనలో పది మంది పోలీసులతో సహా 18 మందికి గాయాలయ్యాయి. మొత్తం 16 వాహనాలు ధ్వంసమయ్యాయి.