: కాంగ్రెస్ వైఫల్యానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: జయప్రకాశ్ నారాయణ
రెండు సార్లు ప్రజలు పట్టం కట్టినా, యూపీఏ ప్రభుత్వం మాత్రం దారుణంగా వైఫల్యం చెందిందని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఈ రోజు వస్తున్న ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రజలు తమను తిరస్కరించారన్న విషయాన్ని కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తించాలని తెలిపారు. ప్రచార ఆర్భాటం తప్ప కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని అన్నారు. లోక్ సత్తా ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పేదరికాన్ని అరికడుతున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని జేపీ విమర్శించారు. దేశవ్యాప్తంగా పుష్కలంగా వనరులున్నా, కాంగ్రెస్ వాటిని ఉపయోగించుకోలేకపోయిందని అన్నారు. విద్యారంగంలో మన దేశాన్ని ప్రపంచంలోనే కింద నుంచి రెండో స్థానంలో యూపీఏ నిలబెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వైఫల్యం వల్ల రూ. 4,80,000 కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిలిచిపోయాయని జేపీ ఎద్దేవాచేశారు.