: రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెబుతారు: చంద్రబాబు
దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. సోనియా కుట్రలను, రాహుల్ మాటలను ప్రజలు గ్రహించారని చెప్పారు. 10 జన్ పథ్ (సోనియా నివాసం) చేతిలో ప్రధాని మన్మోహన్ సింగ్ కీలుబొమ్మగా మారిపోయారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోలేనంతగా ప్రజలు తీర్పునిచ్చారని చెప్పారు.
నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు పరాభవం తప్పలేదన్నారు. ఛత్తీస్ గఢ్ లో మాత్రం కొన్ని జిల్లాల్లో మావోయిస్టుల దాడుల వల్ల కొన్ని ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలో జగన్ ను జైలు నుంచి తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నారని, ఇక్కడ కూడా కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై విలేకరులు ప్రశ్నించగా.. 'ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.. సుపరిపాలనకు పట్టం కట్టారు. వీటికి చిరునామా తెలుగుదేశం పార్టీ. ప్రజలు టీడీపీని గెలిపిస్తారు' అని చెప్పారు.