: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత!
ప్రముఖ హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అకాల మరణం చెందారు. గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న సుబ్రహ్మణ్యం హైదరాబాదులోని తన స్వగృహంలో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 54 సంవత్సరాలు. ఆనందోబ్రహ్మ టీవీ సీరియల్ ద్వారా పాప్యులర్ అయిన ధర్మవరపు 800 సినిమాలలో నటించారు.
ఎప్పటి నుంచో సినిమాలలో నటిస్తున్నప్పటికీ, 'నువ్వు నేను' సినిమా తర్వాత స్టార్ కమెడియన్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. వివాదరహితుడిగా సినీ పరిశ్రమలో ఆయనకు పేరుంది. 'తోకలేని పిట్ట' సినిమాతో దర్శకుడిగా కూడా మారారాయన. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు. అనంతర కాలంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈయనను రాష్ట్ర సాంస్కృతిక మండలి కార్యదర్శిగా నియమించారు. ఇటీవలే మరో హాస్యనటుడు ఏవీయస్ మరణించడం ... ఇప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణించడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.