: ఈ ఇటుకలతో కట్టిన ఇళ్లు చాలా వెచ్చగా ఉంటాయట


ఇటుకలతో కట్టిన ఇళ్లు మాములుగానే కాస్త వెచ్చగా ఉంటాయి. మరి అంతకన్నా ఎక్కువ వెచ్చదనాన్ని ఇచ్చే ఇటుకలని ఇప్పుడు తయారుచేశారు. వీటి తయారీలో మామూలు మట్టి కాకుండా ఇతరత్రా పదార్థాలను కూడా ఉపయోగించారు. ముఖ్యంగా బీరు తయారుచేసిన తర్వాత మిగిలిన ధాన్యాలను వేసి వీటిని తయారుచేశారు. కాబట్టి, ఇలాంటి ఇటుకలతో కట్టిన ఇళ్లు మరింత వెచ్చగా ఉంటాయని వీటి తయారీదారులు చెబుతున్నారు.

సాధారణంగా వేడిని పట్టివుంచే సామర్ధ్యాన్ని పెంపొందించడానికి ఇటుకల్లో పాలీస్టీరెన్లను కూరుస్తుంటారు. అలాకాకుండా వీటిలో బీరు తయారుచేసిన తర్వాత మిగిలిన ధాన్యాలను ఉపయోగిస్తే అలా తయారుచేసిన ఇటుకలకు వేడిని మరింత ఎక్కువగా పట్టివుంచే సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటుకలను తయారుచేసే మట్టిలో ఐదు శాతం బీరు ధాన్యాలను కలిపి పరిశోధకులు ఈ సరికొత్త ఇటుకలను తయారుచేశారు. పోర్చుగల్‌లోని పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టోమర్‌కు చెందిన ఎడ్యురాడోఫెరాజ్‌ బృందం ఇలాంటి ఇటుకలను తయారుచేసి, బీరు తయారుచేయగా మిగిలిన ధాన్యాన్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చని నిరూపించింది.

మరో విశేషం ఏమంటే ఈ బీరు ఇటుకలు మన సాంప్రదాయ ఇటుకలలాగే పటిష్టంగా ఉండడమేకాదు, ఇవి మిగిలిన వాటికన్నా కూడా 28 శాతం తక్కువ ఉష్ణాన్ని కోల్పోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. బీరు ధాన్యాలను మట్టిలో కలపడం వల్ల ఇటుకల్లో మరింత ఎక్కువ సంఖ్యలో రంధ్రాలు ఏర్పడతాయని, ఇవి గాలిని బంధించి, వేడిని పట్టివుంచడానికి తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. పర్యావరణానికి హాని చేయని, ఇళ్లలో ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ఈ బీరు ఇటుకలు ఎంతగానో తోడ్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News