: ఎగ్జిట్ పోల్స్ సర్వేలు నిరాధారమైనవి: కాంగ్రెస్
ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్) బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని, కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని టుడేస్ చాణక్య సర్వే వెల్లడించింది. అటు ఢిల్లీలోనూ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బేనని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే తెలిపింది. వీటిపై స్పందించిన కాంగ్రెస్.. సర్వేలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఛత్తీస్ గఢ్ లో తప్పకుండా విజయఢంకా మోగిస్తామని హస్తం భావిస్తోంది.
కాగా, నిన్న(గురువారం)ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్ మాట్లాడుతూ.. ఎగ్జిట్ పోల్స్ దేశ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించేవన్నారు. అవి పార్టీ అభ్యర్థులను, కార్యకర్తలను నిరుత్సాహపరుస్తాయని అన్నారు. డిసెంబర్ 8న ఐదు రాష్ట్రాల కౌంటింగ్ పార్టీకి కొత్త ఉదయమని.. నిజమైన ఫలితాలు ఆరోజే తెలుస్తాయన్నారు. ఏది ఏమైనా ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని దాస్ ధీమా వ్యక్తం చేశారు.