: నిండు సభలోనే రాజీనామాలు.. నలుగురు కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపీల నిర్ణయం
పది జిల్లాలతో కూడిన తెలంగాణకే కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో, సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, ఎంపీల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. కేంద్ర కేబినెట్ ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకోవడంతో వీరంతా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం తమ డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోలేదని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్ఠానానికి దిమ్మతిరిగేలా లోక్ సభలోనే తమ రాజీనామాలను సమర్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా, నిండు సభలోనే తమ రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు చిరంజీవి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పురంధేశ్వరితో పాటు ఎంపీలు హర్షకుమార్, లగడపాటి, అనంత వెంకట్రామిరెడ్డి, రాయపాటి, ఉండవల్లి, సాయిప్రతాప్, సబ్బంహరిలు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలసి కేబినెట్ ఏకపక్ష నిర్ణయంపై అసంతృప్తిని బహిర్గతం చేయనున్నారు.