: ఎనర్జీ డ్రింకుతో ఉన్న ఎనర్జీ గోవిందా!
కూల్ డ్రింకుల్లో ఎనర్జీ డ్రింకుల గురించి మనందరికీ తెలుసు. వీటిని తాగితే ఎనర్జీ వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఎనర్జీ డ్రింకులను తాగితే ఎనర్జీ వచ్చే సంగతి దేవుడెరుగు, ఉన్న ఆరోగ్యం కాస్తా పాడయ్యే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఎనర్జీ డ్రింకులను పెద్దలకన్నా ముఖ్యంగా పిల్లలు తాగితే వారి ఆరోగ్యంపై అత్యధిక వ్యతిరేక ప్రభావం చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఎనర్జీ డ్రింకులను తాగడం వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ డ్రింకుల్లో ఉండే కెఫైన్, టారైన్లు గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్నవారు ఈ డ్రింకులను తాగిన గంట తర్వాత వారి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
చిన్న పిల్లలు, ముఖ్యంగా కౌమార ప్రాయంలో ఉన్నవారిపై ఈ డ్రింకులు మరింత ఎక్కువ ప్రభావం చూపుతాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేనియల్ కె థామస్ చెబుతున్నారు. మామూలు కాఫీ, కోలా వంటి వాటితో పోల్చితే ఈ ఎనర్జీ డ్రింకుల్లో ఉండే కెఫైన్ మూడురెట్లు ఎక్కువగా ఉంటుందని, దీని ఫలితంగా గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని, రక్తపోటు కూడా పెరుగుతుందని థామస్ చెబుతున్నారు. కాబట్టి ఎనర్జీ డ్రింకుల వల్ల ఎనర్జీ రాదు సరికదా.. ఉన్న ఎనర్జీ తగ్గుతుంది జాగ్రత్త!