: సంపూర్ణ తెలంగాణ సాధనకు యుద్ధమే: కేసీఆర్
రాయల తెలంగాణ అనేది గత కొంత కాలంగా మీడియాలో ప్రచారం అవుతోందని, తనకు కూడా వ్యక్తిగతంగా మిత్రులు రాయల తెలంగాణ ప్రతిపాదనపై సమాచారం అందించారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదనను టీఆర్ఎస్ కరాఖండిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల భాష, ఆశ టీఆర్ఎస్ పార్టీదని, అందుకే తాము కేవలం తెలంగాణను మాత్రమే కోరుకుంటున్నామని ఆయన తెలిపారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణను ప్రతిపాదిస్తే తాము అంగీకరించేది లేదని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయాల్సిన బాధ్యత తనకు ఉందన్న కేసీఆర్, హైదరాబాద్ నగరం మీద కానీ, ఇతర అంశాలమీద కానీ తనకు కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అసెంబ్లీ స్థానాల సంఖ్య, జిల్లాల సంఖ్య, సరిహద్దులను పేర్కొంటూ తీర్మానం చేశారని గుర్తుచేశారు. దీనిని కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం చేస్తున్న ప్రతిపాదనను తాము ఒప్పుకోమని ఆయన స్పష్టం చేశారు.
జీవోఎం ప్రతిపాదించిన రాయల తెలంగాణ కోసం అమరవీరులు ఆత్మబలిదానాలు చేయలేదని ఆయన తెలిపారు. 10 జిల్లాల తెలంగాణే తమకు ఆమోద యోగ్యమని గతంలో చాలా లేఖల్లో కేంద్రానికి స్పష్టం చేశామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల శ్రమ అని, జీవోఎంతో తాను, కేకే వాదించి నివేదిక ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. అసలు జీవోఎం ఎవరి సమస్య పరిష్కరించేందుకు కూర్చుందని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది తెలంగాణ ప్రజలని, అలాంటిది జీవోఎం పరిష్కరిస్తోంది ఎవరి సమస్యలు? అని నిలదీశారు. కొత్త కొత్త అంశాలను జీవోఎం సభ్యులు తెరమీదికి తెస్తున్నారని, దీని వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. తమకు పది జిల్లాలతో కూడిన తెలంగాణే ఆమోదయోగ్యమని, దానినే తాము సాధించుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పాటవుతుందని చెబుతూ, మిగిలిన 28 రాష్ట్రాలకు ఉన్న హక్కులు వర్తిస్తాయని గతంలో షిండే తమకు తెలిపారని ఆయన అన్నారు.
సీడబ్ల్యూసి నిర్ణయంలో కానీ, భారత రాజ్యాంగంలో కానీ ఉమ్మడి రాజధాని అనే పదం లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ తాము కొంత కాలం ఉమ్మడి రాజధానిగా సీమాంధ్రులను భరించేందుకు ఒప్పుకున్నామని కేసీఆర్ తెలిపారు. సీమాంధ్రులను ఉన్నపళంగా తరిమేయడం సరికాదని, హుందాగా కొంతకాలం ఉమ్మడి రాజధానికి ఆమోదించామని కేసీఆర్ తెలిపారు. దాన్ని అలుసుగా తీసుకుని ఉమ్మడి రాజధాని మీద ఆంక్షలు నిర్ణయించడం తమను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అవతరించిన నాడు మద్రాసులో తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య 12 శాతమేనని చిదంబరానికి తాను గుర్తు చేశానని.. అలాగే నేడు హైదరాబాద్ లో కూడా సీమాంధ్రులు 5 లక్షల మందే ఉన్నారని శ్రీకృష్ణ కమిటీ తెలిపిందని ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి రాజధాని అంటూ కేంద్రం దేశంలో తప్పుడు సంప్రదాయన్ని ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. తాము గతంలోనే జీవోఎంతో భేటీ అయిన సందర్భంగా పూర్తి సమాచారం అందించామని.. జీవోఎం కేటాయించిన పావుగంట సమయం సరిపోదని, మళ్లీ రమ్మంటే వస్తామని చెప్పామని నివేదించామన్న కేసీఆర్, తమకు తెలంగాణ మాత్రమే కావాలని స్పష్టం చేశామన్నారు.
టీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజలకు భరోసానిచ్చే పార్టీ అని జీవోఎంకు తెలిపినట్టు కేసీఆర్ తెలిపారు. తమ ప్రాణాలు పోయినా.. తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా.. రాయల తెలంగాణకు ఒప్పుకోమని ఆయన అన్నారు. మరో యుద్ధానికి సిద్ధమవుతామని సవాలు విసిరారు. రానున్న 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, గ్రామాల్లో నిరసన ర్యాలీలు చేపడతామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తూ 6న అవసరమైతే టీఆర్ఎస్ అర్థరాత్రి వరకు సమావేశం అవుతుందని తెలిపారు.
అప్పటి పరిణామ క్రమాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. సంపూర్ణ తెలంగాణ సాధనకు మరో యుద్ధం ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 5న వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలకు చెందిన వారితో సహా అందరూ సహకరించి బంద్ పాటించాలని సూచించారు. ఈ పరీక్షా సమయంలో అందరూ.. జంట నగరాలతో సహా స్వచ్చందంగా బంద్ పాటించాలని సూచించారు. ప్రభుత్వోద్యోగులు కూడా బంద్ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. కీలకమైన తరుణంలో అందరూ సహకరించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.