: కాంగ్రెస్ ను తిట్టాల్సిన చంద్రబాబు వైయస్ ను విమర్శిస్తున్నారు: జగన్
బచావత్ తీర్పు ప్రకారం రాష్ట్రానికి కృష్ణానది మిగులు జలాలపై పూర్తి హక్కులున్నాయని వైఎస్సార్సీపీ అధినేత జగన్ అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు చాలా బాధాకరమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు పూర్తిగా మద్దతు పలికిందని తెలిపారు. సోనియాగాంధీ, సీఎం కిరణ్, మాజీ సీఎం రోశయ్యను తిట్టని చంద్రబాబు... నాలుగేళ్ల క్రితం చనిపోయిన వైయస్ ను మాత్రం విమర్శిస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లోని వైకాపా కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. మిగులు జలాలను ఉపయోగించుకునేలా అప్పటి పాలకులు ప్రాజెక్టులు నిర్మించుకోలేకపోయారని విమర్శించారు. తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు ఏనాడూ ప్రాజెక్టుల గురించి ఆలోచించలేదని అన్నారు. అప్పట్లో వైయస్ ఇచ్చిన అఫిడవిట్ తప్పేమీ కాదని జగన్ అన్నారు. మిగులు జలాలను తెచ్చుకోవచ్చనే భావనతోనే వైయస్ ప్రాజెక్టులు నిర్మించాలనుకున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీళ్లు కూడా లేకుండా రాష్ట్రాన్ని విభజించాలని సోనియాగాంధీ భావిస్తున్నారని విమర్శించారు.