: ముక్కంటి నామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు


సృష్టి లయంకరుడు శివుడు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సకల ప్రాణికోటికి అభయనాథుడైన ఈ మహాశివుడు మెచ్చిన రోజే ఈ మహాశివరాత్రి. 'భక్తులు మీకు ఏరోజు పూజలు చేస్తే సంతుష్టులౌతారు స్వామీ' అని దక్ష పుత్రిక పార్వతి అడిగిన ప్రశ్నకు శివుడు చెప్పిన జవాబేంటో తెలుసా.. ఫాల్గుణ మాసంలో అమావాస్య రోజుల ముగింపు దినమే తనకు అత్యంత ప్రీతిపాత్రమని చెప్పాడుట. అదే ఈనాడు శివరాత్రి అయింది!

ఇప్పుడా మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భోళాశంకరా మా కోరికలు ఈడేర్చు తండ్రీ అన్నా.. ముక్కంటీ నీ చల్లని దృక్కులు మాపై ప్రసరించు నాయనా అన్నా... పో, నువ్వసలు భగవంతుడివే కాదు అని కోపగించుకున్నా..  ఆ దేవదేవుడి స్పందన సానుకూలమే. పండితపామర జనం, వారు వీరు తేడా లేకుండా అందరూ ఆ పరమశివుడి అనుగ్రహానికి పాత్రులే. మరి ఆ శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకుమించిన మంచి రోజు మరేముంటుంది.

దీంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, వేములవాడ, ఏడుపాయల వంటి పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నేడు శ్రీశైలంలో స్వామివారి దర్శనానికి 9 గంటల సమయం పడుతోండగా... భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. శివరాత్రి సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి వద్ద రద్దీ పెరగడం విశేషం. 

  • Loading...

More Telugu News