: కోటిన్నర విలువైన బంగారు నగలతో ఉడాయించిన మణప్పురం గోల్డ్ ఉద్యోగి
అవసరానికి డబ్బులేకపోతే సాధారణంగా ఎవరైనా బంగారాన్ని కుదువబెట్టి డబ్బులు తీసుకుంటారు. కుదువబెట్టిన బంగారమే మాయమైతే... పరిస్థితి ఏంటి? ఇప్పుడు అనంతపురంలోని మణప్పురం గోల్డ్ ఫ్రాంఛైజీలో బంగారాన్ని తాకట్టు పెట్టిన ఖాతాదారుల పరిస్థితి ఇదే. వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా ఉండే మణప్పురం గోల్డ్ ఫ్రాంఛైజీలో వందలాది మంది తమ బంగారాన్ని తాకట్టు పెట్టారు. వీరిలో కొందరు తాము తీసుకున్న అప్పును చెల్లించి... తమ నగలను తీసుకోవడానికి వెళ్లారు. మణప్పురంలో వారి బంగారు నగలు మాయమైనట్టు తెలుసుకుని అవాక్కయ్యారు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేసిన పోలీసులు, అదే సంస్థలో పనిచేస్తున్న విక్రం అనే ఉద్యోగి దాదాపు కోటిన్నర విలువైన బంగారు నగలతో ఉడాయించాడనే విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఈ ఇంటిదొంగ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదని, వారి నగలను వారికి అప్పజెబుతామని మణప్పురం గోల్డ్ అధికారులు తెలిపారు.