: మందు మైకంలో రచ్చరచ్చ చేసిన సినీతార
ఓ సినీ నటి, ఫ్యాషన్ డిజైనర్ సహా మరో ఐదు మంది కలసి నడి రోడ్డు మీద తప్ప తాగి రచ్చరచ్చ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగింది. నిన్న ఉదయం 8.30 గంటలకు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, కన్నడ నటి మాధురి (ర్యాంబో ఫేం) తో సహా మరో ఐదు మంది మల్లేశ్వరం 17వ క్రాస్ కు ఓ విలాసవంతమైన కారులో చేరుకున్నారు. వెంటనే బీరు బాటిల్స్ ఓపెన్ చేసి, కారు ముందు భాగానికి చేరుకుని తాగడం మొదలు పెట్టారు. జరుగుతున్న ఘటనతో చిర్రెత్తుకొచ్చిన స్థానికులు వారిని వారించారు. అంతే, నిలదీసిన స్థానికులపై రమేష్ దిమ్లా రెచ్చిపోయాడు.
ఆ సమయంలో అర్థనగ్న దుస్తులు వేసుకున్న నటి మాధురి, మరో అమ్మాయి అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో, అక్కడున్న మహిళలు తలలు దించుకుని వెళ్లారు. అయితే జరుగుతున్న ఘటనను కొందరు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రంగంలోకి దిగిన రాజకీయ నాయకులు వారిని విడిచిపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి టెలివిజన్ చానెల్స్ ఆ సన్నివేశాలను ప్రసారం చేయడంతో, విషయం వెలుగులోకి వచ్చింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, కేసు నమోదు చేస్తున్నామంటూ పోలీసులు చెప్పడం కొసమెరుపు.