: కొవ్వుతో బోలెడు సమస్యలు
శరీరంలో కొవ్వు పెరిగితే బోలెడు సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఎప్పటినుండో హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా కొలెస్టరాల్ వల్ల రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అధిక కొలెస్టరాల్ మహిళల్లో ముఖ్యంగా మెనోపాజ్‌లోకి అడుగిడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు దోహదం చేస్తున్నట్టు పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. కొలెస్టరాల్ నుండి పుట్టుకొచ్చే 27 హెచ్‌సీ అనే అణువు ఈస్ట్రోజెన్ హార్మోన్ మాదిరిగా రొమ్ము క్యాన్సర్ వృద్ధికి, వ్యాప్తికి దోహదం చేస్తున్నట్టు డ్యూక్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కొలెస్టరాల్‌ను తగ్గించే స్టాటిన్స్ ద్వారా ఈ 27 హెచ్‌సీ ప్రభావం కూడా తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆహార అలవాట్లలో మార్పులు లేదా కొలెస్టరాల్‌ను తగ్గించే చికిత్సల వంటి తేలికైన పద్ధతులతో రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించుకునే అవకాశం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఈ పరిశోధన గురించి దీనికి నేతృత్వం వహించిన డోనాల్డ్ మెక్‌డోనెల్ మాట్లాడుతూ ఊబకాయానికి, రొమ్ము క్యాన్సర్‌కూ ముఖ్యంగా అధిక కొలెస్టరాల్‌కు సంబంధం ఉన్నట్టు చాలా అధ్యయనాల్లో బయటపడినా ఇది ఎలా జరుగుతుందనే విషయం అప్పుడు తెలియరాలేదని, అయితే కొలెస్టరాల్‌కు చెందిన 27 హెచ్‌సీ జీవక్రియ కారకం ఈస్ట్రోజెన్ మాదిరిగా రొమ్ము క్యాన్సర్ వృద్ధికి దోహదం చేస్తున్నట్టు తమ పరిశోధనలో గుర్తించామని మెక్‌డోనెల్ తెలిపారు.