: అభాసు పాలవుతున్న ’ఆధార్‘


2009లో యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆధార్ కార్డుల జారీ ప్రహసనంగా మారిపోయింధి. అన్నింటికీ ఆధార్ కావాలన్న ప్రభుత్వం ఆధార్ కు చట్టబద్ధత కల్పించకుండానే పథకాలకు వర్తింపజేయడంతో ఈ పథకం అభాసు పాలవుతోంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరును తప్పుబట్టింది. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మన్నించింది. ఇటీవల హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో కూడా ఇదే జరిగింది.

ప్రభుత్వ సంక్షేమ పథకాలైన జననీ సురక్ష యోజన, స్కాలర్ షిప్, పింఛన్లు, ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీని ఆధార్ తో అనుసంధానించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పౌరులకు ఆధార్ కార్డుపై పన్నెండంకెలను (విశిష్ట గుర్తింపు సంఖ్య) కేటాయిస్తోంది. కానీ, సంక్షేమ పథకాలకు ఆధార్ ను తప్పనిసరి చేయవద్దంటూ కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.

పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కీ, చావుపుట్టుకలకీ మహారాష్ట్ర ప్రభుత్వం ఆధార్‌ను అనివార్యం చేసింది. లెసైన్సులకు ఆధార్ కావాలని పంజాబ్ ప్రభుత్వం అంటే, కోర్టు కలగజేసుకోవాల్సి వచ్చింది. కానీ బెంగాల్ శాసనసభ మాత్రం ఆధార్‌కు వ్యతిరేకంగా తీర్మానం తీసుకువచ్చే పనిలో ఉంది. నిజానికి చాలామందికి ఆధార్ కార్డులు అందలేదు. పెళ్లి రిజిస్టర్ కాకపోతే ఆ కాపురానికి చట్టబద్ధత ఉండదు. అలాంటప్పుడు చట్టపరిధి లేని ఈ కాపురాన్ని ఏమనాలని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రధాని కార్యాలయంలో విధానాల రూపకల్పనలో కీలకంగా ఉండే మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను వివరణ కోరగా ఆధార్ ఇంకా అధికార పత్రం కాలేదన్నారు. ముందుగా ప్రభుత్వం ఆధార్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత తీసుకురావాలి. అంతేకాని పథకానికి చట్టబద్ధత లేకుండా అనుసంధానించే ప్రయత్నం చేస్తే అభాసు పాలవక తప్పదు. అయినా ప్రభుత్వ పథకాలు ప్రజల కష్టాలు తీర్చాలే కాని, ఎన్నికల్లో లెక్క చెప్పడానికి కాదని పాలకులు గ్రహించాలి.

  • Loading...

More Telugu News