: బంగారు తాపడంతో ధగధగలాడుతున్న మహాబోధి ఆలయం!
బీహార్ లోని బోధగయలో నెలకొన్న పదిహేను వందల ఏళ్ల నాటి మహాబోధి ఆలయానికి బంగారపు పూత పనులు పూర్తయ్యాయి. దాదాపు మూడు వందల కేజీల బంగారంతో ధాయ్ లాండ్ కు చెందిన సాంకేతిక నిపుణులు ఆలయానికి బంగారపు మెరుపులద్దారు. దాంతో, కొత్తరూపు సంతరించుకున్న ఆలయం ధగధగలాడుతూ.. చూపరులను మరింత ఆకర్షిస్తోంది. కొన్ని చిన్న చిన్న పనులు మినహా నిన్ననే (బుధవారం)అంతా పూర్తైందని ఆలయ కార్యదర్శి బిక్షు చలిందా తెలిపారు. బంగారు తాపడంతో ఆలయం ఇప్పుడు చాలా అందంగా కనపడుతోందని చెప్పారు. తాపడానికి 289 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన థాయ్ రాజుల ట్రెజరీకి, బౌధ్ధ భక్తులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నిన్నటివరకు దాదాపు రెండువందల మంది భక్తులు అక్కడ ప్రార్థనలు చేశారని పేర్కొన్నారు.