: మందు మాన్పించడానికి కొత్త చికిత్స!
మందు తాగవద్దని చెబితే మందుబాబుల చెవికెక్కదు. ఇలాంటి వారికి వైద్యం చేస్తామని చాలా ప్రకటనలను మనం రోజూ చూస్తుంటాం. ఈ వైద్యం సంగతి ఏమోగానీ, మద్యపానం వ్యసనాన్ని మాన్పించడానికి కొత్త చికిత్సను పరిశోధకులు కనుగొనేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో మన శరీరంలోని ఒక కొత్తరకం జన్యు ఉత్పరివర్తనం కారణంగా అతిగా మందు తాగుతున్నారని పరిశోధకులు గుర్తించారు.
బ్రిటన్కు చెందిన పరిశోధకులు అతిగా మద్యం తీసుకోవడానికి కారణమయ్యే జన్యు ఉత్పరివర్తనాన్ని గుర్తించారు. జీఏబీఆర్బీ1 అనే జన్యువు ఉత్పరివర్తనం మద్యపానం అలవాటును మరింతగా పెంచుతున్నట్టు పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. వీరి అధ్యయనంలో భాగంగా ఎలుకల ఎదుట మద్యం, నీరు రెండూ ఉంచగా సాధారణ ఎలుక మద్యపానంపై పెద్దగా ఆసక్తి చూపలేదట, ఉత్పరివర్తనం జరిపిన ఎలుకమాత్రం తన ముందు ఉంచిన మద్యంలో 85 శాతం తాగేసినట్టు పరిశోధనలో తేలింది.
ఈ విషయాన్ని గురించి న్యూక్యాజిల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు డాక్టర్ క్వెంటిన్ అన్స్టీ మాట్లాడుతూ జన్యుకోడ్లో చిన్న మార్పుతో ఇంతటి ప్రభావం కనిపించడం విశేషమని చెబుతున్నారు. ఈ అధ్యయనం ఫలితంగా మద్యపాన వ్యసనానికి కొత్త చికిత్సను రూపొందించేందుకు సరికొత్త మార్గం దొరికిందని పరిశోధకులు భావిస్తున్నారు.