: అమెరికన్లకు అలాంటి బొమ్మలను చూస్తే భయమట!


అవును ... అమెరికన్లకు ఆ బొమ్మలంటే చచ్చేంత భయం. ఆ వివరాల్లోకి వెళితే... మన ప్రాంతాల్లో సిగరెట్‌ పెట్టెలపై పుర్రె బొమ్మ వంటివి ముద్రించినా, పొగతాగితే ఆరోగ్యానికి హానికరం అంటూ స్లోగన్లు ముద్రించినా మనవాళ్లు మాత్రం గుప్పుగుప్పు మంటూ పొగతాగడం మానరు. కానీ అమెరికన్లు సిగరెట్టు పెట్టెలపై బొమ్మలతో కూడిన హెచ్చరికలను ముద్రిస్తే ఇక ఠక్కున పొగతాగడం మానేస్తారట.

పదేళ్ల క్రితం కెనడా ఇలాంటి బొమ్మలతో కూడిన హెచ్చరికలను సిగరెట్‌ పెట్టెలపై ముద్రించింది. దీంతో అక్కడ 4.7 శాతం మంది పొగరాయుళ్లు అసలు వాటి జోలికే వెళ్లలేదట. ఈ మార్పును ఉదాహరణగా తీసుకుని యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ వాటర్‌లూకు చెందిన శాస్త్రవేత్తలు బొమ్మలతో కూడిన హెచ్చరికలు (గ్రాఫిక్‌ వార్నింగ్‌ లేబుల్స్‌)పై అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో బొమ్మలతో కూడిన హెచ్చరికలుంటే 86 లక్షలమంది అమెరికన్లు ఠక్కున పొగతాగడం మానేస్తారని తేలిందట. ఇలాంటి హెచ్చరికలు పొగరాయుళ్లను బాగా ఆలోచించేలా చేస్తాయని, విపరీతంగా పొగతాగే చైన్‌స్మోకర్లను కూడా స్మోకింగ్‌ అలవాటును మానుకునేలా, మళ్లీ వాటివైపు చూడకుండా ఉండేలా వారిలో దృఢ నిశ్చయాన్ని కలిగిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇప్పటికే 40 దేశాలు సిగరెట్‌ పెట్టెలపై ఇలాంటి హెచ్చరికలను ముద్రిస్తున్నా అమెరికా మాత్రం ఇలాంటి పని చేయలేకపోతోంది. దీనికి కారణం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ను సిగరెట్‌ కంపెనీలు అడ్డుకోవడమే. ఈ కంపెనీలపై న్యాయపోరాటం చేయడానికి ఈ అధ్యయనం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చక్కగా ఉపయోగపడుతుందట.

  • Loading...

More Telugu News