: నరాలను చూసే బంటు!
నరాలను చూడడం ఏంటి? అని అనుమానంగా ఉందా... మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు నరానికి ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం నీరసంగా ఉన్న సమయంలో ఇక నరం అనేది దొరకదు. అలాగే రక్తపరీక్షకు కూడా ఒక్కోసారి నరం దొరకదు. దీంతో నరానికి నీడిల్ ఎక్కించడానికి నానా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అలాకాకుండా చక్కగా నరం ఎక్కడుందో కనిపిస్తే డైరెక్టుగా నరానికి ఇంజెక్షన్ని గుచ్చేవచ్చుకదా... అప్పుడు డాక్టరుకు నరాన్ని వెదికే శ్రమ తగ్గుతుంది, మనకు కూడా నరం కోసం సూది పొడుపుల నరకం తప్పుతుంది. ఇలా మన శరీరంలోని నరాలను చూపించే ఒక సరికొత్త కళ్లజోడును శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఈ జోడుతో నరాలను చక్కగా చూడవచ్చని చెబుతున్నారు.
అమెరికా సంస్థ ఈవెనా మెడికల్ ఒక సరికొత్త స్మార్ట్ కళ్లజోడును తయారుచేసింది. ఈ కళ్లజోడుతో మన నరాలు చక్కగా కనిపిస్తాయని చెబుతోంది. ఈ జోడును ధరించినవారికి ఎదుటివారి చర్మం కింద ఉన్న రక్తనాళాలు చక్కగా కనిపిస్తాయని, దీంతో రక్తనాళాలకు ఇంజక్షన్ చేయడం సులభమవుతుందని దీని తయారీదారులు చెబుతున్నారు. ఐస్ ఆన్ గ్లాసెస్ అనే పేరుతో తయారుచేస్తున్న ఈ సరికొత్త కళ్లజోళ్లు వచ్చే ఏడాదికి మార్కెట్లోకి రానున్నాయి.