: అప్పుడు అక్కడ నీరుండేదట


అంగారకుడిపై వాతావరణం ఎలా ఉండి ఉండేదని శాస్త్రవేత్తలకు ఎన్నాళ్లనుండో ఆసక్తి ఉండేది. అరుణగ్రహంపై ఒకప్పుడు భూమిపై ఉన్న వాతావరణాన్ని పోలిన వాతావరణ పరిస్థితులు ఉండేవట. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. సుమారు 380 కోట్ల సంవత్సరాల కిందట గ్రీన్‌హౌస్‌ ప్రభావం వల్లే అంగారకుడిపై ఇంచుమించుగా భూమిని పోలిన వాతావరణ పరిస్థితులు ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఒక నమూనాను ఉపయోగించిన శాస్త్రవేత్తలు కార్బన్‌డై ఆక్సైడ్‌, నీరు, హైడ్రోజన్‌ సరిపడినంత పరిమాణంలో ఉంటే అంగారకుడి ఉపరితల ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థాయికి మించి ఉంటాయని నిర్ధారించారు. కోట్ల సంవత్సరాల క్రిందట పరమాణు హైడ్రోజన్‌, కార్బన్‌డై ఆక్సైడ్‌, నీరు వల్ల అరుణగ్రహంపై ఇలాంటి ప్రభావం ఉండేదని, దీనివల్ల ద్రవరూపంలో నీరు ప్రవహించే స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండేవని శాస్త్రవేత్తలు ఈ నమూనా ద్వారా వివరించారు. ఇలా ప్రవహించిన నీరు పలు ప్రాంతాల్లో కాలువలను ఏర్పరిచాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాన్ని గురించి ఈ పరిశోధనలో పాలుపంచుకున్న రామ్సెస్‌ ఎం రమిరెజ్‌ మాట్లాడుతూ గత ముఫ్ఫై సంవత్సరాలుగా అంగారకుడిపై వేడి, నీటి ప్రవాహ పరిస్థితులు ఎలా ఉండేవనే విషయం శాస్త్రవేత్తలకు అంతుబట్టకుండా ఉండేదని, ఈ మిస్టరీకి తాము విశ్వసనీయమైన పరిష్కారాన్ని చూపామని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News