: రాముడిపై సీమాంధ్ర నేతలకు భక్తి లేదు: హరీష్ రావు
రాష్ట్ర విభజన నేపథ్యంలో, టీఆర్ఎస్ నేత హరీష్ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడిపై సీమాంధ్ర నేతలకు అసలు భక్తే లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాముడిని, గిరిజనులను పోలవరం ప్రాజెక్టులో ముంచడానికే సీమాంధ్ర నేతలు భద్రాచలాన్ని అడుగుతున్నారని విమర్శించారు. భద్రాచలం, హైదరాబాద్ పై కేంద్రం ఆంక్షలు విధిస్తే... తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టేనని అన్నారు. భద్రాచలం, హైదరాబాద్ తెలంగాణకు రెండు కళ్లు అని... ఎట్టి పరిస్థితుల్లో వాటిని వదులుకోమని హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర చరిత్రలో కిరణ్ కుమార్ రెడ్డిదే అత్యంత దుర్మార్గమైన పరిపాలన అని దుయ్యబట్టారు.