: ఇవ్వడంలో ఆనందముంది
ఒకరికి ఇవ్వడంలో ఆనందం ఉంది. ఈ విషయం చాలామంది గుర్తించలేరు. గుర్తించిన వారు ఈ ఆనందాన్ని ఇస్తూ అనుభవిస్తుంటారు. ప్రముఖ గడియారాల కంపెనీ టైటాన్ నిర్వహించిన ఒక సర్వేలో పద్దెనిమిది నుండి ఇరవైనాలుగేళ్ల వయసున్న ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఒకరు పండుగ సమయాల్లో తాము ఇచ్చే బహుమానాలకన్నా పుచ్చుకుంటున్న బహుమానాలే అధికంగా ఉంటున్నాయని తేలింది.
సాధారణంగా పండుగ సమయాల్లో ఎక్కువగా మనకు దగ్గరివారికి ఏదో ఒక బహుమతిని కొనిస్తుంటాం. ఇలాంటి వాటికి సంబంధించి పండుగ సీజన్లో 55 ఏళ్ల వయసు పైబడిన వారు ఎక్కువగా బహుమానాలను ఇస్తున్నారని ఈ నివేదిక చెబుతోంది. అలాగే మహిళల్లో 31 శాతం మంది తాము ఇస్తున్న బహుమానాలకు సమానమైన బహుమానాలను తిరిగి పుచ్చుకుంటున్నారట. కానీ పురుషుల్లో మాత్రం తాము ఇచ్చిన దాంట్లో 23 శాతం బహుమతులను మాత్రమే తిరిగి పుచ్చుకుంటున్నారని ఈ సర్వే తెలిపింది.
ఈ సర్వేకోసం టైటాన్ సంస్థ 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు 3,400 మంది వినియోగదారులను సంప్రదించింది. మరో ముఖ్య విషయం ఏమంటే తమ జీవిత భాగస్వామికోసం బహుమతిని ఎంచుకోవడంలో మహిళలే చురుగ్గా ఉంటున్నారని, 64 శాతం మంది భర్తలు తమ భార్యలు అందించిన బహుమానాలతో సంతృప్తి చెందుతుండగా, 51 శాతం మంది మహిళలు మాత్రమే తమ భర్తలు ఇస్తున్న బహుమతుల పట్ల సంతృప్తిగా ఉన్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది.