: మెరుపు సమ్మెకు దిగుతాం: అశోక్ బాబు
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగ సంఘాలన్నీ మెరుపు సమ్మెకు సిద్ధమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడతామని కేంద్రం నిర్ణయించిన మరుక్షణం తాము మెరుపు సమ్మెకు దిగుతామని అన్నారు. ఈ మేరకు ఒక స్టీరింగ్ కమిటీని వేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్ర విభజన బిల్లు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడం జరగదని అన్నారు.
గతంలో ఎమ్మెల్యేలంతా విభజనను అడ్డుకుంటామన్నారని ఆమేరకు లేఖలు కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. వారు తమ మాటను నిలబెట్టుకుంటారని తాము ఆశిస్తున్నామని అశోక్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా తాము సమ్మెకు వెళ్లమని, కేంద్రం తీరును పరిశీలించాకే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. 11 అంశాలపై స్పష్టతతో పాటు హైదరాబాద్ పై స్పష్టత ఇవ్వాలని ఆయన జీవోఎంను డిమాండ్ చేశారు.
సీమాంధ్రకు చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రజావిశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. ఎంపీలను నమ్ముకునే కంటే జాతీయ పార్టీల నేతలను నమ్ముకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు సమ్మె చేసి జీతాలు కోల్పోతే నేతలు కాలక్షేపం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చేలా కలిసి రావాలని అన్ని ఉద్యమ సంఘాలకు అశోక్ బాబు పిలుపునిచ్చారు.